Home > Movie Reviews

ధర్మయోగి మూవీ రివ్యూ

Nov 02 2016 12:45:26 PM

ధర్మయోగి మూవీ రివ్యూ

సినిమా : ధర్మయోగి
నటులు: ధనుష్ , త్రిష, అనుపమ పరమేశ్వరన్
సంగీతం: సంతోష్ నారాయణన్
దర్శకత్వం : ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్

రఘువరన్‌ బి.టెక్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగాదగ్గరైన తమిళ నటుడు ధనుష్ లేటెస్ట్ సినిమా ధర్మయోగి. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘కొడి’ చిత్రాన్ని తెలుగులోకి ధర్మయోగిగా డబ్ చేశారు.
ఈ సినిమాలో కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు ధనుష్. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ‘ధర్మయోగిపై’ చాలా హైఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంది.

 

 

కథ:

ధర్మయోగి సినిమా ఇద్దరు కవలల సినిమా. ధర్మ ( ధనుష్), యోగి ( ధనుష్) ఇద్దరూ కవల పిల్లలు. వీళ్ళ తండ్రి రాజకీయాల్లో ఓ పార్టీ తరుపున యాక్టివ్‌గా తిరుగుతుంటాడు. మెర్క్యురీ ఫ్యాక్టరీ విషపదార్థాల వల్ల చాలామంది చనిపోతుంటారు. అయితే ఆ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పార్టీ కోసం ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి ఆత్మహత్య చేసుకొనేటప్పుడు ప్రత్యక్షంగా చూసిన యోగి తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసి పార్టీ యువజన నాయకుడిగా ఎదుగుతాడు. మరోవైపు యోగి తమ్ముడు ధర్మ బాగా చదువుకొని లెక్చరర్ అవుతాడు. యోగి మొరటుగా, ధర్మ తెలివిగా వ్యవహరిస్తుంటారు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించే మహిళా నాయకురాలు రుద్ర ( త్రిష) యోగి ప్రేమించుకుంటారు. రాజకీయంగా ప్రత్యర్థ పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే రాజకీయంగా ఎదగడానికి రుద్ర తన పార్టీ మంత్రిపై ఫోర్జరీ కేసు వేయించి బర్తరఫ్ అయ్యేలా చేస్తుంది. అంతేగాక ఉపఎన్నికల్లో పార్టీ తరుపున ఎమ్మెల్యేగా టికెట్‌తో పాటు జిల్లా కార్యదర్శి పదవిని సొతం చేసుకుంటుంది. ఇదే సమయంలో తన తండ్రి మరణానికి కారణమైన మెర్క్యురీ ఫ్యాక్టరీకి సంబంధించి 200కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధర్మ నుండి తెలుసుకున్న యోగి ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియచేస్తాడు. అయితే పార్టీ అధినేత, మాజీ మంత్రి ఆ కుంభకోణంలో భాగస్వామ్యులుగా ఉండడంతో యోగిని ఆ విషయాన్ని వదిలేయమంటారు. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో నిరాశకు గురైన యోగి ఈ విషయాన్ని రుద్రకు చెప్తాడు. అయితే రుద్ర ఈ కుంభకోణ విషయాన్ని తన ప్రచార అస్త్రంగా మార్చుకోవడంతో తప్పని పరిస్థితుల్లో యోగిని ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. దాంతో యోగికి, రుద్రకు చిన్న చిన్న మనస్పర్థలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో యోగి జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. ఆ ఘటనకి రుద్ర ఎలా కారణం అనేదే కథ. ఆ పరిస్థితుల్లో ధర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది సిల్వర్ స్క్రీన్‌లో చూడాల్సిందే.

 

 

ఎనాలసిస్:

ప్రస్థానం సినిమా తరువాత ఆ తరహా ఇంటెన్సిటీ ఉన్న సినిమా ధర్మయోగి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మానవీయ సంబంధాలు ఎలా మారుతున్నాయన్న కాన్సెప్ట్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు దురై సెంథిల్ కుమార్. సినిమాలో దాదాపు అన్ని పాత్రలు మన చుట్టూ తిరుగుతన్న పాత్రలుగా అనిపించేలా చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అలా అనిపిస్తున్నప్పటికీ ఎక్కడా ప్రేక్షకుడు అంచనా వేయలేని ట్విస్ట్‌లు ఇచ్చాడు. సీన్లు చాలా కొత్తగా కనిపిస్తుంటాయి. యోగి ఎమ్మెల్యేగా నిలబడడం, త్రిష రాజకీయంగా ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థులను ఎప్పటికప్పుడు తన ఎదుగుదలకోసం వాడుకొని తొక్కేయడంవంటి సీన్లు చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూనే కథను ముందుకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. మోటు పనులు చేసే యోగికి రుద్రలాంటి రఫ్ క్యారెక్టర్, ఎంతో తెలివిగా నెమ్మదిగా ఉండే ధర్మకు అనుపమ చేసిన మాలతి క్యారెక్టర్‌ను పెయిర్ చేసి కథను బాగా నడిపించారు. ఈ సినిమాకు నిజంగా బలం అంటే స్క్రీన్ ప్లే నే. ఎందుకంటే సినిమాలో ప్రేక్షకుడు ఎక్కడా బోర్ అవ్వకుండా చాలా గ్రిప్పింగ్‌‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్, సంగీతం మాత్రం చాలా బాగా ఉన్నాయి. పాటలు సైతం ఏదో డబ్బింగ్‌సినిమాలో ఉన్నట్లుగా కాకుండా చాలా బాగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఉన్న మైనస్ విషయం పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించడం. అవసరంలేని పాటలను స్టోరీలో ఉంచడం కాస్త ఇబ్బందే.

 

 

ఎవరెలా నటించారు:

పక్కింటి కుర్రాడిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ తన పాత సినిమాల మాదిరిగానే ఎక్కడా హడావిడి లేకుండా సహజంగా నటించాడు. ధర్మ, యోగి రెండు పాత్రల్లోనూ ధనుష్ అద్భుతంగా జీవించాడు. రెండు క్యారెక్టరైజేషన్లకు ఏమాత్రం సంబంధంలేనప్పటికీ ఏ పాత్రకు తగ్గట్లుగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో యోగి లవర్‌గా, రాజకీయంగా ఎదగాలనే భిన్న మనస్తత్వాలు ఉన్న క్యారెక్టర్ చేసిన త్రిష నిజంగా తన కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్ చేసింది. త్రిష క్యారెక్టరైజేషన్‌ బలంగా ఉండడంతో దానికి తగ్గట్లుగా రాజకీయనాయకురాలిగా చాలా పరిణితిగా నటించింది. ఈ సినిమాలో కొత్త త్రిషను చూడడం మాత్రం ఖాయం. మాలతి క్యారెక్టర్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. యోగి ఫ్రెండ్‌గా నటించిన నటుడు సైతం తన పాత్రకు న్యాయం చేశాడు.

 

 

ఓవరాల్:

రాజకీయాలపై ఇష్టం ఉన్నవాళ్ళకి మంచి కిక్ ఎక్కించే సినిమా…

 

 

రేటింగ్: 3.25 / 5