Home > Movie Reviews

కాష్మోరా మూవీ రివ్యూ

Nov 02 2016 12:41:24 PM

 కాష్మోరా మూవీ రివ్యూ

కథ

కాష్మోరా (కార్తీ) భూతప్రేతాత్మలను డబ్బుల కోసం లొంగదీసుకుంటున్నట్లు జనాలను మోసం చేస్తుంటాడు. దివ్య మంగళ జగదాంబ అనే ఒక ఆశ్రమంలో కాశ్మోరా తండ్రి (వివేక్) తన కుటుంబంతో కలిపి దొంగ స్వామిలా చలామణి అవుతుంటాడు. మరోవైపు ఆత్మల పేరుతో మోసాలు చేసే వారిపై శ్రీ దివ్య రీసర్చ్ చేస్తుంటుంది. అలా రీసెర్చ్ లో భాగంగా శ్రీదివ్య ‘కాశ్మోరా’ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. అదే సమయంలో రాష్ట్రమంత్రి ధనకోటి తనకు అడ్డువస్తున్నాడన్న నెపంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ ని చంపుతాడు. అయితే ప్రభుత్వం ఆ మర్డర్ కేసుని సిబిఐకి బదిలీ చేస్తుంది. తనకేదో జరుగుతుందని భావిస్తున్న ధనకోటిని, ఒకరోజు ట్రాప్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు ‘కాశ్మోరా’. అలా ధనకోటి కాశ్మోరాను బాగా నమ్మి తన ఇంట్లో ఇన్ కం టాక్స్ రైడ్ జరుగబోతోందని తెలుసుకొని ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు, ఆస్థుల పేపర్లు అన్నీ ‘కాశ్మోరా’ ఇంట్లో దాచిపెడ్తాడు. ఆ డబ్బుల బ్యాగులు తీసుకొని ‘కాశ్మోరా’ ఫ్యామిలీ బిచాణా ఎత్తేస్తుంది. మరోవైపు అదే సమయానికి ముత్యాలచెరువులో ఉన్న దయ్యాలకోటలో దయ్యాన్ని వెళ్ళగొట్టాలని చింతామణి అనే వ్యక్తి కాష్మారోను ఆ ఇంటికి ఆహ్వానిస్తాడు. అయితే ఆ దయ్యాల కోటకు వెళ్ళిన తర్వాత కాష్మోరాకు ఊహించని విధంగా పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కడ ఉన్న దయ్యాలు కాష్మోరాను భయపెట్టాయా?? అసలు ఆ దయ్యాలకోటలో ఉన్న దయ్యాల కథేంటి? దయ్యాల కారణంగా ‘కాష్మోరా’ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? చివరికైనా దయ్యాల బారినుండి ‘కాష్మోరా’ కుటుంబం బయటపడగలిగిందా అన్నదే కథ. అసలు ఈ సినిమాలో నయనతార ఎవరు? అసలు ఫ్లాష్ బ్యాక్ కథేంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా సిల్వర్ స్క్రీన్‌లో చూడాల్సిందే..

ఎనాలసిస్

దీపావళి కానుకగా విడుదలైన ‘కాష్మోరా’ సినిమా ప్రేక్షకులను నిజంగా మంచి టైంపాస్ చెయ్యడానికి రెడీగా ఉంది. సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్ళడంలో అడ్డుపడ్డాయి. సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడంతో కొన్ని సీన్లు వస్తున్నప్పుడు సినిమా సాగదీసినట్లుగా అనిపించడం మాత్రం ఖాయం. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచం శ్రద్ధపెడితే సినిమా బాగా ఉండేది. సినిమా మొదట్లో వచ్చిన పాట, చివర్లో వచ్చిన పాటలు సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా ఉండడంతో ప్రేక్షకులు సీరియస్‌గా జరుగుతున్న కథనుండి డీవియేట్ అయ్యే పరిస్థితి ఉంది. అంతేగాక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద మైనస్. బ్యాగ్రౌండ్ స్కోర్‌లో కేర్ తీసుకొని ఉండే సినిమా రేంజ్ ఇంకాస్త పెరిగేది. చిన్న కథనే అయినప్పటికీ స్క్రీన్-ప్లే విషయంలో చాలా నెమ్మదిగా సాగింది. హర్రర్ కామెడీ అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే అంశాలు సినిమాలో లేవు. సినిమా కథకు మూలమైన పూర్వకథను డీల్ చేయడంలోనూ దర్శకుడు పూర్తి శ్రద్ధపెట్టలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజూనాయక్ అనే క్యారెక్టర్‌ను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే సినిమా అసలు కథలో జీవం వచ్చేది. ఫ్లాష్ బ్యాక్‌లో నయనతార చిన్న క్యారెక్టర్ చేసినప్పటికీ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా నరేట్ చేస్తే బాగుండేది. అయితే ప్రస్తుత పరిస్థితులను 800ఏళ్ళ క్రితం కథలో లింక్ చేయడం కోసం తీసుకున్న కథ నిజంగా మంచి ఎంటర్‌టైనింగ్ ఎలిమెంటే. ఈ సినిమాకు నిజంగా జీవం తెచ్చింది కార్తీనే. ‘కాష్మోరా’ క్యారెక్టర్‌లో కార్తీ కనిపించినంతసేపు ప్రేక్షకులకు ఫుల్ టైం పాసే. అంతేగాక రాజ్ నాయక్ పాత్రలో కూడా కార్తీ అలరించాడు. రాజ్ నాయక్ పాత్రకు చేసిన మేకప్ ఆ పాత్రకు కొంచమైనా సీరియస్‌నెస్ తెచ్చింది. మామూలుగా ఉండే హర్రర్ కామెడీకి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టాఫ్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సెకండాఫ్‌ అంతే గ్రిప్పింగ్‌గా ఉంది. సెకండాఫ్‌లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి. దర్శకుడు గోకుల్ నిజంగా ఓ కొత్తరకమైన కథను ఎంచుకోవడంలో బాగానే ధైర్యం చేశారు. సినిమా ఎంత సీరియస్‌గా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కామెడీ డోసేజ్ తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

 

ఎవరెలా చేశారు

కాష్మోరా, రాజనాయక్ పాత్రల్లో కార్తీ తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి నటించాడు. కొన్ని సీన్లలో అయితే కార్తీ నటించడం కంటే పాత్రలో జీవించాడాని చెప్పుకోవాలి. రత్న మహాదేవి పాత్రలో కనిపించింది కొంచంసేపే అయినప్పటికీ నయనతార ఎప్పటిలాగే ఫుల్ మార్క్స్ కొట్టేసింది. దయ్యాలపై రీసెర్చ్ చేసే క్యారెక్టర్ చేసిన శ్రీదివ్య కూడా తన వంతు పాత్ర తను పోషించింది. కాష్మోరా తండ్రి పాత్ర చేసిన వివేక్ తనదైన కామెడీ చెయ్యడానికి ప్రయత్నించినప్పటికీ ఫుల్‌ లెంగ్త్ కామెడీని అందించలేదు.

 

ఓవరాల్

ఏమాత్రం భయపెట్టని దయ్యంతో పోరాడానని బిల్డప్ ఇచ్చే ఓ మోసగాడి కథ.

 

రేటింగ్: 3.25 / 5