Home > Movie Reviews

శంకర మూవీ రివ్యూ

Nov 02 2016 12:40:44 PM

శంకర మూవీ రివ్యూ

భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు తాతినేని సత్య ప్రకాశ్ దర్శకత్వంలో విడుదలైన ‘శంకర’లో నారారోహిత్ లీడ్‌రోల్ చేశాడు. 2011లో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మౌనగురు’ సినిమాకు రీమేక్ అయిన సినిమా ‘శంకర’. తమిళంలో తీసిన కాన్సెప్ట్‌తో హిందీలో సోనాక్షి సిన్హా లీడ్ రోల్‌గా చేసిన ‘అకీరా’ సూపర్ హిట్ అయ్యింది. అయితే హిందీ ‘అకీరా’కు, తమిళ ‘మౌనగురు’కు ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కించిన ‘శంకర’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ప్రత్యేకమైన పాత్రలు పోషించిన నారా రోహిత్ ఈ సినిమాలో విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా నారా రోహిత్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుంది?

 

కథ

సినిమా మొత్తం శంకర్ (నారా రోహిత్ ) అనే కాలేజ్ అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం కారణంగా అందరితో గొడవలు పడుతుంటాడు. అయితే కాలేజీ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు శంకర్ అన్నయ్య తన తల్లిని, శంకర్ ని హైదరాబాద్‌లో తన ఇంటికి షిఫ్ట్ చేస్తాడు. అదే ఇంట్లో ఉండే శంకర్ వదిన చెల్లెలు అనన్య (రెజీనా) శంకర్‌ను ఇష్టపడుతుంది. అయినా తన అన్నయ్య ఇంట్లో ఉండకుండా ఓ కాలేజీలో చేరిన శంకర్ కాలేజీ హాస్టల్‌లో చేరతాడు. కాలేజీలో కూడా చిన్న చిన్న గొడవల్లో తల దూరుస్తుంటాడు శంకర్. ఇదే టైంలో ఎసిపి ప్రసాద్ (జాన్ విజయ్) తన ముగ్గురు జూనియర్ ఆఫీసర్స్‌తో కలిసి ఇష్టమొచ్చిన విధంగా జనాలతో ప్రవర్తిస్తుంటాడు. మందుతాగి శంకర్ చదివే కాలేజీ వార్డెన్ని కొట్టి పెద్ద గొడవకు కారణం అవుతారు ఈ పోలీసులు. సిటీ శివార్లలో ఓ కార్ యాక్సిడెంట్‌ జరిగితే కారు డిక్కీలో ఉన్న డబ్బులకోసం కారులో ఉన్న వ్యక్తిని చంపి రోడ్ యాక్సిడెంట్‌లా క్రియేట్ చేస్తాడు ఎసిపి. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన జూనియర్స్‌తో ఫోన్‌లో మాట్లాడే వీడియో తీస్తుంది ఎసిపి గర్ల్‌ఫ్రెండ్ మాయ. ఆ తర్వాత ఆ వీడియోను తన ఫ్రెండ్స్‌కి చూపించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలుచేద్దమని ప్లాన్ వేస్తుంది. ఇంతలో ఆ అమ్మాయి బ్యాగ్‌నుండి వీడియో కెమరాను దొంగలించి ఎసిపికి ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తాడు ఓ వ్యక్తి. అయితే విషయం తెలుసుకున్న ఎసిపి తన గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేస్తాడు. ఆ తర్వాత కాలేజీ హాస్టల్‌లో మాయమైన వస్తువుల బ్యాగ్ శంకర్ రూం దగ్గర దొరకడంతో శంకరే ఎసిపిని బ్లాక్‌మెయిల్ చేసాడనుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఎన్‌కౌంటర్ చేయడానికి తీసుకెళ్తారు ఎసిపి టీం. అసలు శంకర్ కు ఈ కేసుకు ఏంటి సంబంధం? ఎన్‌కౌంటర్‌ చేయడానికి తీసుకెళ్ళిన శంకర్ ను పోలీసులు నిజంగానే ఎన్‌కౌంటర్ చేశారా? శంకర్ ఎన్‌కౌంటర్ అయ్యాడా లేక పోలీసుల నుండి తప్పించుకొని వాళ్ళపై ప్రతీకారం తీర్చుకున్నాడా అన్నదే స్టోరీ?

 

ఎనాలసిస్

‘శంకర’ సినిమా స్క్రిప్ట్ తమిళ మాత‌ృక ‘మౌనగురు’కు దగ్గరగా ఉంది. అయితే ‘శంకర’లో మాత్రం మామూలు తెలుగు సినిమా తరహాలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం స్టోరీలైన్ ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది కానీ అవసరమైన చోట నాటకీయంగా కనిపించేలా జాగ్రత్తలు మాత్రం తీసుకున్నారు. అంతేగాక తమిళంలో, హిందీలో ఈ సినిమా చూసిన వాళ్ళకి, స్టోరీలైన్ పూర్తిగా తెలిసిన వాళ్ళకి మాత్రం స్టోరీ విషయంలో కొత్తదనం ఏమీ అనిపించదు కానీ ‘శంకర’లో మాత్రం తెలుగు నేటివిటీకి, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీసారు. ఇలాంటి స్టోరీలైన్ ఉన్నప్పుడు సోషియో పొలిటికల్ స్టేట్‌మెంట్స్ చేయడానికి కథను ఉపయోగించుకుంటారు. అయితే ఈ సినిమాలో మాత్రం కేవలం కమర్షియల్ యాంగిల్‌లోనే సినిమాను తెరకెక్కించారు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో డ్రామా ఎలిమెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ‘అకీరా’ సినిమాలో ఉన్న మెంటల్ హాస్పిటల్‌ సీన్లను ‘శంకర’లో తగ్గించేశారు. సెకండాఫ్‌ను ఆ రెండు సినిమాలకు భిన్నంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ‘అకీరా’ను ఫుల్‌లెంగ్త్‌ సీరియస్ యాక్షన్ సినిమాలాగా తెరకెక్కించడంపై మురుగదాస్ దృష్టిపెడితే ‘శంకర’లో సినిమా సీరియస్‌నెస్‌ను కంటిన్యూ చేస్తూనే హీరోయిన్ అనన్య (రెజీనా) పాత్రతో కాస్త కమర్షియల్ హంగులను చేర్చడానికి ట్రై చేశారు. అయితే అనన్య పాత్ర స్టోరీని ముందుకు తీసుకెళ్ళేందుకు ట్రైచేసేలా కాకుండా సీరియస్‌నెస్‌ను తగ్గించేసింది. కానీ యాక్షన్ సీన్లను మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేసాడు. ఎడిటింగ్‌ విషయంలో అదరగొట్టడంతోపాటు సినిమాటోగ్రఫీ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు.

 

ఎవరెలా చేశారు?

ఇప్పటివరకు నారా రోహిత్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌నే చేశాడు. ఈ సినిమాలో శంకర్‌గా లీడ్ రోల్ చేసిన నారారోహిత్ తనదైన స్టైల్‌లో ఆకట్టుకోవడానికి చాలాబాగా ట్రై చేశాడు. అయితే కొన్ని సీన్లలో మాత్రం డైలాగ్స్ చెప్పే దగ్గర లెవల్స్ తగ్గడంతో సీన్ ఇంటెన్సిటీ డైలాగ్‌లో క్యారీ అవలేకపోయింది. అయితే యాక్షన్ సీన్లలో మాత్రం అదరగొట్టేశాడు రోహిత్. ఎసిపి ప్రసాద్ క్యారెక్టర్ చేసిన జాన్ విజయ్ తన ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో విలనిజాన్ని చూపించాడు. అయితే సినిమా పోలీసుల మాదిరిగా కాకుండా జాన్ విజయ్ యారెగెంట్ బిహేవియర్‌ చూసినంతసేపు నిజమైన కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ మాదిరిగానే కనిపించాడు. సినిమాలో ఆకట్టుకున్న క్యారెక్టర్ రాజీవ్ కనకలాది. ఒక అవినీతి సిఐగా రాజీవ్ చేసిన రోల్ సినిమాలో హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో కమర్షియల్ యాంగిల్ కోసమే హీరోయిన్ రెజీనాకి అనన్య క్యారెక్టర్ రాసినట్లున్నారు. అయినప్పటికీ రెజీనా తన రోల్‌కు న్యాయం చేసింది.

 

చివరిగా

ఓవరాల్‌గా ‘శంకర’ సినిమా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిన ‘శంకర’ నారా రోహిత్ నటనతో మరో అడుగు ముందుకు వేసింది. అయితే అనవసరమైన సీన్లను తగ్గించి సినిమాను ఇంకాస్త సీరియస్‌గా ఉండేలా తెరకెక్కించింటే హిందీ ‘అకీరా’ను తలదన్నేదిలా ఉండేది. సినిమాకు నిజంగా సెకండాఫ్ ప్లస్ అయ్యింది.

రేటింగ్ : 3.25/5