Home > Movie Reviews

నాగభరణం మూవీ రివ్యూ

Oct 31 2016 09:39:27 AM

నాగభరణం మూవీ రివ్యూ

తెలుగువారు గర్వపడేలా చేసిన అమ్మోరు, అరుంధతివంటి సినిమాలను రూపొందించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మరో విజువల్ వండర్ ‘నాగభరణం’. పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ నిర్మించారు. ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని చేసి ఈ సినిమాలో తెరకెక్కించారు కోడి రామకృష్ణ.  కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయనను గ్రాఫిక్స్ ద్వారా తెరపైన నిజంగా నటించాడనుకొనేలా చేసిన నాగభరణం ఈ రోజు తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందిన నాగభరణం సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంది??

 

 

కథః

 

శివయ్య (సాయికుమార్) కుటుంబం తరతరాలుగా ఓ సంస్థానంలో దుష్ట శక్తులేవీ నాశనం చేయకుండా కాపాడే ఎంతో పవిత్రమైన కలశాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాంటి కలశాన్ని దోచుకెళ్ళాలని కపాలి అనే  అఘోరా ప్రయత్నిస్తుంటాడు. కపాలి చేసే ఒక దాడిలో శివయ్యకు అండగా నిలబడి కపాలిని తిప్పికొడ్తుంది శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) . సంస్థానంలో ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడే నాగమ్మ చివరికి కపాలి చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోతుంది. అయితే ప్రాణాలు పోయేముందు ఎన్ని జన్మలెత్తైనా ఆ కలశాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్టిస్తానని శపథం చేసి చనిపోతుంది. అలా ప్రాణాలు కోల్పోయిన నాగమ్మ మరో జన్మలో మానస (రమ్య)గా మారి కలశాన్ని సంపాదించడానికి మ్యూజిక్ టీం ఉన్న నాగచరణ్ దగ్గరికి చేరుతుంది. అలా మానసగా మారిన నాగమ్మ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి?? కలశాన్ని సంపాదించాలని మానస చేసిన ప్రయత్నాలను కపాలి ఎలా అడ్డుకున్నాడు??? మానస చివరికైనా కలశాన్ని సాధించిందా??? మానసకు సహాయం చేయడానికి పరమేశ్వరుడు ఎలాంటి శక్తిని సృష్టించాడన్నదే కథ.

 

ఎనాలసిస్ :

 

కోడి రామకృష్ష సినిమా అనగానే జనాల్లో ఉన్న క్రేజ్‌ని సొంతం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది నాగభరణం. టైటిల్‌కు సరిపోయే డెప్త్ సినిమాలో ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా చూపించలేకపోయారు. సినిమా మొత్తం చూసిన తర్వాత ఓ ఐదారు సీక్వెన్స్‌లు మినహా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమాత్రంలేకుండా తెరకెక్కించారు. ఎందుకంటే సినిమా కథ మూలాంశమైన కలశాన్ని ఏదో ఓ ఆటవస్తువులాగా ట్రీట్ చేసి ఓ మ్యూజిక్ కాంపిటీషన్‌కి బహుమతిగా ఇవ్వడానికి పెట్టడం అనే కాన్సెప్టే సిల్లీగా ఉంది. దీనికితోడు సినిమాలో విలన్‌గా చేసిన అఘోరాను ఫైటింగ్ సీక్వెన్స్‌ల్లో తప్ప కథకు సరిపోయేలా సీరియస్‌గా చూపించలేకపోయారు. ఈ విలన్‌కు తోడు సినిమా కథలో మరో ముగ్గురు విలన్లు ఉన్నప్పటికీ ఏదో పాము చేతిలో చావడానికే ఆ క్యారెక్టర్లను డిజైన్ చేసినట్లుగా అనిపించింది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ సినిమాలో అవసరం ఉన్నదానికంటే క్యారెక్టర్లు ఎక్కువగా ఉండడంవల్ల కథమీద పట్టు కోల్పోయి ఏదో సాగదీసినట్లుగా అనిపిస్తుంటుంది. అసలు ఫస్టాఫ్‌లో సినిమా ఏమాత్రం సీరియస్‌గా లేకపోవడం పెద్ద మైనస్. వీటికితోడు నాగభరణం డబ్బింగ్ సినిమాకావడంతో ఆర్టిస్టుల్లో నేటివిటీలేకపోవడం, డైలాగ్స్‌ ఆకట్టుకోలేకపోవడం వంటి సమస్యలు చాలానే ఉన్నాయి.

 

అయితే నాగభరణం సినిమాలో మెచ్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. సినిమా సెకండాఫ్‌లో తెరకెక్కించిన తీరు సినిమావైపు ప్రేక్షకుడి దృష్టి చూడాలనిపించేలా ఉంది. రమ్య హీరోకి చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు మాత్రం సినిమాకే హైలెట్‌గా ఉన్నాయి. అందులో శివయ్యగా సాయికుమార్ చేసిన క్యారెక్టర్ కథలో జీవం పోసింది. సాయికుమార్ ఎంటరైనప్పుడు తీసిన ఫైటింగ్ సీన్లు, సినిమా చివర్లో అఘోరాతో విష్ణువర్ధన్ యుద్ధం చేసే సీక్వెన్స్‌ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్లాష్‌బ్యాక్‌లో రమ్య నాగమ్మగా ఉన్న సీన్లు చూస్తుంటే మాత్రం ప్రతిఒక్కరికీ ఖచ్చితంగా అరుధంతి సినిమాలో జేజమ్మ గుర్తుకురావడం మాత్రం ఖాయమనే చెప్పుకోవచ్చు. నాగమ్మగా రమ్య అద్భుతంగా నటించింది. తనదైన స్టైల్‌లో తన పాత్రకు న్యాయం చేసింది. అయితే మానసగా చేసిన సీన్లు మాత్రం అంతలా మెప్పించలేకపోయాయి. వీటన్నింటికితోడు క్లైమాక్స్‌లో జీవంతోలేని విష్షువర్ధన్‌ని క్రియేట్ చేసి యాక్ట్ చేయించిన విజువల్ గ్రాఫిక్స్ టీం మకుటను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే విష్షువర్ధన్ కనిపించినంతసేపు ఆయనే యాక్ట్ చేశాడనేలా తీర్చిదిద్దడం మాత్రం గొప్ప విషయం.

 

ఓవరాల్: అంచనాలను అందుకోలేని నాగభరణం.

 

రేటింగ్ : 2.25 / 5